చైనా చెర వీడిన 10 మంది భార‌త జ‌వాన్లు!

గ‌ల్వాన్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో చైనాకు చిక్కిన 10 మంది భార‌త సైనికుల‌ను ఆ దేశం వ‌దిలిపెట్టింది. వారిలో ఇద్ద‌రు మేజ‌ర్లు కూడా ఉన్నారు. సోమ‌, మంగ‌ళ‌వారాల్లో ల‌ఢ‌ఖ్ తూర్పు ప్రాంతంలోని గ‌ల్వాన్ నదీ లోయ వ‌ద్ద ఇరు దేశాల సైనికుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో 20 మంది భార‌త సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 76 మంది గాయ‌ప‌డ్డారు. చైనా వైపు ఎంత‌మంది సైనికులు కోల్పోయార‌నే విష‌యాన్ని ఆ దేశం అధికారికంగా వెల్ల‌డించ‌క‌పోయినా.. 35 మంది చైనా సైనికులు చ‌నిపోయార‌ని అమెరికా నిఘా వ‌ర్గాలు తెలిపాయి.

అయితే, ఆ ఘ‌ర్ష‌ణ‌ల సంద‌ర్భంగా 10 మంది భార‌త సైనికులు చైనా బ‌ల‌గాల‌కు చిక్కార‌ని, ఇరుదేశాల మేజ‌ర్ జ‌న‌ర‌ల్‌ల స్థాయిలో మూడు రోజుల‌పాటు జ‌రిగిన సుదీర్ఘ చ‌ర్చ‌ల అనంత‌రం చైనా సైన్యం గురువారం సాయంత్రం వారిని విడిచిపెట్టింద‌ని పీటీఐ వార్తా సంస్థ వెల్ల‌డించింది. అయితే దీనికి సంబంధించి ఆర్మీ అధికారిక ప్ర‌క‌ట‌న చేయాల్సి ఉంది. కాగా, గ‌ల్వాన్ లోయ‌లో చైనా సైన్యంతో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల సంద‌ర్భంగా భార‌త సైనికులు ఎవ‌రూ మిస్ కాలేద‌ని ఇండియ‌న్ ఆర్మీ అధికారులు గురువారం ప్ర‌క‌టించారు.

అదేవిధంగా గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణ‌ల్లో మొత్తం 76 మంది భారత జ‌వాన్లు గాయ‌ప‌డ్డార‌ని, వారిలో 18 మందికి తీవ్ర గాయాలు కాగా, మ‌రో 58 మంది స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డార‌ని గురువారం ఇండియ‌న్ ఆర్మీ అధికారులు వెల్ల‌డించారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ 18 మంది లేహ్ ఆస్ప‌త్రిలో, స్వ‌ల్ప గాయాలైన మిగ‌తా 58 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని తెలిపింది. కాగా, 1967లో నాథులా ఘ‌ర్ష‌ణ‌ల త‌ర్వాత భార‌త్‌-చైనా బ‌ల‌గాల మ‌ధ్య ఈ స్థాయిలో ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగ‌డం ఇదే తొలిసారి. నాటి ఘ‌ర్ష‌ణ‌ల్లో 80 మంది భార‌త జవాన్లు, 300 మంది చైనా సైనికులు మృతిచెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *