దేశంలో కరోనా కేసులు ప్రతిరోజు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గురువారం ఉదయం వరకు 24 గంటల్లో 16,922 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, శుక్రవారం రోజు రికార్డు స్థాయిలో 17 వేలు దాటాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 17,296 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ ప్రాణాంతక మహమ్మారి వల్ల ఒకేరోజు 407 మంది బాధితులు మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,90,401కి చేరగా, మృతుల సంఖ్య 17,296కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 1,89,463 యాక్టివ్‌ కేసులు ఉండగా, 2,85,637 మంది బాధితులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు.

దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ర్టాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 4841 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తంగా 1,47,741 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 6,931 మంది బాధితులు మృతిచెందగా, 77,453 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 63,357 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక రెండో స్థానంలో ఉన్న ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 73,780కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2429 మంది బాధితులు మృతి చెందారు. దేశ రాజధానిలో నిన్న ఒక్కరోజే 3390 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 64 మంది మరణించారు.

దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో ఇప్పటివరకు 70,977 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 911 మంది మృతిచెందారు. నాలుగో స్థానంలో ఉన్న గుజరాత్‌లో 29,520 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1753 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో గురువారం 636 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 20,193కు చేరగా, ఈ వైరస్‌ వల్ల 611 మంది చనిపోయారు. ఆరో స్థానంలో ఉన్న రాజస్థాన్‌లో మొత్తం కేసుల సంఖ్య 16,296కి చేరింది. ఇప్పటివరకు 379 మంది మృతిచెందారు. 15,648 కేసులతో పశ్చిమబెంగాల్‌, 12,596 కేసులతో మధ్యప్రదేశ్‌, 12,463 కేసులతో హర్యానా, 11,364 కేసులతో తెలంగాణ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

జూన్‌ 25 వరకు దేశవ్యాప్తంగా 77,76,228 నమూనాలను పరీక్షించామని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ప్రకటించింది. నిన్న ఒక్కరోజే దేశంలో 2,15,446 పరీక్షలు చేశామని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *