కరోనాతో హైదరాబాద్ నగరం ఎప్పుడు పేలుతుందో తెలియదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జన్ సంవాద్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగింస్తూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. కేంద్రం రెండు బృందాలను పంపి సలహాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి, కేంద్రాన్ని విమర్శించిందని ఆయన అన్నారు. అత్యధిక మరణాలు హైదరాబాద్ లో నమోదు అవుతున్నాయని, ఒక లాబ్ లో టెస్ట్ చేసిన దాంట్లో 71 శాతం పాజిటివ్ కేసులు వచ్చాయని, హైదరాబాద్ ని గాలికి వదిలేశారని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వం కాపాడుతుంది అని అనుకోకుండా, ఆశలు పెట్టుకోకుండా మనకు మనమే జాగ్రత్తగా ఉందామని ఆయన పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాలకు ఎలాంటి సహాయం చేసిందో తెలంగాణ రాష్ట్రానికి కూడా అదే సహాయం కేంద్రము చేసిందని, 2.5 లక్షల PPE కిట్స్ 6.5 లక్షలు మాస్క్ లు, 22 లక్షల టాబ్లెట్స్ తెలంగాణ కి ఇచ్చామని ఆయన అన్నారు. ఒంటెద్దు పోకడలతో సకాలంలో నిర్ణయాలు తీసుకోకుండా దారుసలం, మజ్లీస్ ఆదేశాల పై ప్రభుత్వం నడుచుకుంటుందని అన్నారు.

ప్రజలు భయ పడుతున్నారు, ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తి స్వేచ్ఛ నిచ్చామని, “ప్రభుత్వ పరంగా లోపం ఉంది.. ప్రగతి భవన్ లో నిర్ణయం తీసుకోవడం లేదు.. కష్ట పడడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని” ఆయన అన్నారు. టెస్ట్ ల కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్రాన్ని పాలించాల్సిన పెద్దలే ఫార్మ్ హౌస్ లో ఉంటే ఎలా ? హైదరాబాద్ ప్రజలు ఎక్కడికి పోవాలి ? అని ఆయన ప్రశ్నించారు.

ఢిల్లీలో 20 లక్షల టెస్ట్ లు చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు చేయడం లేదు.. యుద్ధ ప్రాతిపదికన టెస్ట్ లు చేయాలని కోరుతున్నానని ఆయన అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన పోవాలని, కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల నుండి తెలంగాణను కాపాడాలని ఆయన అన్నారు. కుటుంబ పాలనకు, మతోన్మాద పార్టీ లతో అంతకాగే పార్టీ లకు చరమ గీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. మాటల, కోతల ప్రభుత్వం తప్ప బంగారు తెలంగాణ ఏది ?  ఆత్మ బలిదానం చేసుకున్న అమర వీరుల ఆకాంక్షల కోసం పని చేసే ప్రభుత్వం కాదని ఆయన అన్నారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *