పేదప్రజలకు 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం పంపిణీని అడ్డుకున్న పాపం, ఉసురు తప్పక తగులుతుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఆదర్శ నగర్ లోని MLA క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో మాట్లాడారు. కరోనా మహమ్మారి తో తీవ్ర ఇబ్బందులలో ఉన్న పేద ప్రజలకు భారీ వర్షాలతో మరిన్ని సమస్యలు తోడయ్యాయని పేర్కొన్నారు. కష్టాలలో ఉన్న పేద ప్రజలకు అండగా ఉండాలి, వారిని ఆదుకోవాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముంపుకు గురిన ఒక్కో కుటుంబానికి 10 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం ప్రకటించి అందజేశారని వివరించారు. 108 సంవత్సరాల తర్వాత ఎవరూ ఊహించని విధంగా భారీ వర్షం కురిసి ప్రజలు ఎంతో నష్టపోయారని పేర్కొన్నారు. జాతీయ విపత్తుగా గుర్తించి సహాయం అందించాల్సిన కేంద్రప్రభుత్వం నేటి వరకు ఎలాంటి సహాయాన్ని అందించలేదని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, డిల్లీ, ఓడిస్సా తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ధిక సహాయాన్ని అందించి అండగా నిలిచాయని తెలిపారు. చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఆర్ధిక సహాయం అందించిన దాఖలాలు లేవని ఆయన చెప్పారు. మీ సేవ కేంద్రాల ద్వారా నేటి వరకు 1.65 లక్షల మండి దరఖాస్తు చేసుకున్నారని, వారందరికి బ్యాంకు ఖాతాల లో 10 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కండ్ల ఎదుట కనిపిస్తున్నాయని, ప్రజలలోకి తాము చేసిన అభివృద్ధి పనులతో వెళతామని స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలు, దూషణలు మానుకోవాలని ప్రతిపక్షాలకు ఆయన హితవు పలికారు. తాము ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని అన్నారు. తమను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎన్ని చేసినా తాము రెచ్చిపోబోమని అన్నారు. తాము ఎంతో బలవంతులమని విర్రవీగే పార్టీలు ఇతర పార్టీల నుండి వచ్చే వారికి టికెట్ లు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గత GHMC ఎన్నికలలో 150 స్థానాలలో TRS పోటీ చేసి 99 స్థానాలను గెలుచుకున్నామని, ఈ సారి 104 స్థానాలకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ కుటుంబం నుండి కార్పోరేషన్ ఎన్నికలలో ఎవరూ పోటీ చేయడం లేదని మంత్రి ప్రకటించారు. గత కొద్ది రోజుల నుండి దీనిపై ప్రచారం జరుగుతుందని, అది అవాస్తవం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *