కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళనలకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పంజాబ్‌కు చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి ఉద్యోగం వదిలేయగా… తాజాగా రాజస్థాన్‌కు చెందిన రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) చీఫ్ హనుమాన్ బెనివాల్ తన పదవులకు రాజీనామా చేశారు. తన మూడు పార్లమెంటరీ కమిటీలకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రైతుల నిరసనకు బహిరంగంగా తన మద్దతు తెలిపిన హనుమాన్ బేనివాల్.. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు.
రాజస్థాన్‌లోని నాగౌర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న బెనివాల్.. తన పదవుల నుంచి తప్పుకున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించిన లేఖను ఆయన జతచేశారు. తాను సభ్యుడిగాఉన్న ప్యానెళ్ల సమావేశాల్లో తాను లేవనెత్తిన సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బెనివాల్ తన లేఖలో ఆరోపించారు. ప్రస్తుతం… పరిశ్రమలపై స్టాండింగ్ కమిటీ, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ, పిటిషన్ల కమిటీ సభ్యుడిగా హనుమాన్ బెనివాల్ ఉన్నారు. రాజస్థాన్ అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు రాజస్థాన్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఆర్ఎల్పీ కీలక మిత్రపక్షంగా ఉన్నది.
ఇక… కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలను నిరసిస్తూ రైతులు నవంబర్ 26 నుంచి ఆందోళన ప్రారంభించారు. ఢిల్లీ సరిహద్దుల వద్ద వేలాది మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా నాలుగైదు రోజులపాటు రైతు ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చలు జరిపారు. అయితే, సుప్రీంకోర్టులో కేసు దాఖలుకావడంతో కేంద్రంతో చర్చలు ప్రతిష్ఠంభనకు గురయ్యాయి.