చిరుతో చేయమన్నారు.. కుదరదని చెప్పేశా :విజయశాంతి

తెలుగు ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్ అంటే ఎవరు.. ఇప్పుడు నయనతార అని చెప్తున్నారు కానీ ఎవర్ గ్రీన్ లేడీ సూపర్ స్టార్ అంటే విజయశాంతి మాత్రమే. లేడీ అమితాబ్ అంటూ అభిమానులతో ఆప్యాయంగా పిలిపించుకుంది ఈమె. వందల సినిమాల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ఎప్పటికీ చెరిగిపోని గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా 80, 90వ దశకంలో విజయశాంతి ఓ సంచలనం. ఈమె సినిమా వచ్చిందంటే హీరోలతో సమానంగా వసూళ్లు సాధించేవి. హీరోలతో పని లేదు అంటూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరోయిన్ విజయశాంతి. ఆమె నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలే కాదు కొందరు హీరోలతో కూడా ఈమె కాంబినేషన్ అదుర్స్ అంతే.

అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నాడు. వీరిద్ద‌రి కాంబినేషన్‌లో వచ్చిన చాలా సినిమాలు రికార్డులను తిరగరాశాయి. ఎన్నో సంచలన విజయాలకు కేరాఫ్‌గా నిలిచిందీ జోడీ. అయితే గ్యాంగ్ లీడర్ సమయంలో ఈ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని.. అందుకే ఆ తర్వాత కలిసి నటించలేదని వార్తలు వచ్చాయి. అనుకున్నట్లుగానే చిరంజీవి, విజయశాంతి నటించక కొన్ని దశాబ్ధాలు గడిచిపోయాయి. ఇదిలా ఉంటే విజయశాంతి కూడా 2006లో వచ్చిన నాయుడమ్మ సినిమా తర్వాత మళ్లీ సినిమాల్లో నటించలేదు. చాలా గ్యాప్ తర్వాత అనిల్ రావిపూడి చెప్పిన కథ నచ్చి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరులో నటించింది. ఇందులో హీరోయిన్ రష్మిక మందన్న 70 లక్షల పారితోషికం అందుకుంటే.. విజయశాంతికి మాత్రం 2 కోట్లకు పైగా ఇచ్చారని ప్రచారం కూడా జరిగింది.

ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత విజయశాంతికి కుప్పలు తెప్పలుగా అవకాశాలు వచ్చాయి. కానీ ఈమె మాత్రం ఒక్క సినిమాకు కూడా ఓకే చెప్పలేదు. అందులో చిరంజీవి సినిమా కూడా ఉండటం విశేషం. చిరంజీవి లూసీఫర్ రీమేక్‌లో కూడా ఈమెను నటించాల్సిందిగా కోరారు. ఇదే విషయాన్ని విజయశాంతి కూడా కన్ఫర్మ్ చేసింది. అయితే తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో నటించడం కుదరదని చెప్పినట్లు తెలిపింది విజయశాంతి. ఇకపై సినిమాలకు దూరంగానే ఉంటానని చెప్పింది. రాజకీయాల్లో సమయం సరిపోవడం లేదని.. ఇక సినిమాలు చేస్తే రెండూ కుదరవు అంటూ ఓపెన్ గానే తేల్చేసింది విజయశాంతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *