నేపాల్ రాజకీయ సంక్షోభం తారా స్థాయికి చేరింది. ప్రభుత్వంలోని అంతర్గత విభేదాలతో ఆ దేశ ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ పార్లమెంట్ రద్దుకు సిఫారసు చేసింది. ఆ సిఫారసుకు ఆ దేశ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో త్వరలోనే నేపాల్లో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి.
నేపాల్లో కొంతకాలంగా రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. అధికార పార్టీలో తలెత్తిన వివాదాలు పార్లమెంట్ రద్దు వరకు తీసుకెళ్లాయి. ఆదివారం ప్రత్యేకంగా ఆ దేశ ప్రధాని కె.పి. శర్మ ఓలీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి మండలి పార్లమెంట్ రద్దుకు సిఫారసు చేసింది. కేబినెట్ చేసిన సిఫారసును ఆదేశ అధ్యక్షురాలు, రాష్ట్రపతి విద్యాదేవి భండారి ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయంతో నేపాల్లో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 30, మే 10న రెండు విడతల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నట్టు అధికారవర్గాలు ప్రకటించాయి. కాగా, ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు ఖండిస్తున్నాయి.
అయితే.. అధికార నేపాల్ కమ్మూనిస్టు పార్టీ(ఎన్సీపీ)లో కొంతకాలంగా తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయి ప్రధాని పీఠం కోసం.. రెండు వర్గాలు విడిపోయి, ఒకరిపై ఇకరు తీవ్ర స్ధాయిలో విమర్శులు గుప్పించుకుంటున్నారు. తాజాగా పార్లమెంట్ రద్దుతో అవి మరింత తారా స్థాయికి చేరుకున్నట్లైంది.