త్వరలో టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంలో కీలక మార్పులు…?

తెలంగాణలో రాజకీయాలు కాకమీద ఉన్నాయి. గత ఓటములతో అధికార పార్టీ ఆత్మ పరిశీలనలో పడింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి వరుస విజయాలతో ఊపు మీద ఉన్న కారు… 2018 ఎన్నికల వరకు వన్‌-వేలో దూసుకొచ్చింది. ఎన్నిక ఏదైనా గెలుపు గులాబీదేనన్న నినాదంతో జోష్‌ పెచ్చిన టీఆర్ఎస్‌ జోరు… 2019 లోక్‌ సభ ఎన్నికల్లో సీన్‌ సగం వరకు డీలా పడిపోయింది. ఈ మార్పు కోసం దాదాపు 5 ఏండ్లు పట్టింది. కానీ,.. మిగతా సగం మారడానికి ఎక్కువ టైం పట్టలేదు. లోక్ సభ ఎన్నికలు జరిగిన ఏడాది కాలంలోనే వచ్చిన దుబ్బాక ఉప ఎన్నిక రూపంలో గట్టి స్ట్రోక్ ఇచ్చింది. టీఆర్ఎస్ కంచుకోట మెదక్‌ ప్రాంతంలోని నియోజవర్గమైన దుబ్బాక కేంద్రంగా ఊహించిన అపజయాన్ని ఎదుర్కొంది.

ఇక, జీహెచ్ఎంసీలోనూ అంతే అనుకోండి. కొన ప్రాణంతో గెలిచినా… అంత సంతోషం లేకుండా పోయింది. గత ఎన్నికల్లో నాలుగు డివిజన్లలో ఉన్న బీజేపీ ఒక్క ఉదుటున దూకి.. సరాసరి టీఆర్ఎస్ పక్కన చేరింది. గత ఎన్నికల్లో 90కి పైగా డివిజన్లలో ఒంటరి విజయం అందుకున్న టీఆర్ఎస్… 2020లో అతి స్వల్ప డివిజన్ల తేడాతో టీఆర్ఎస్ ముందుంది. కానీ, గత గ్రేటర్ ఎన్నికల ఫలితాలను బేస్‌ చేసుకుని పరిస్థితిని అంచనా వేస్తే… రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఉన్నప్పటికీ గత ఫలితాలకు, ఈ ఫలితాలకు ఇంత వ్యత్యాసం రావడం నిజంగా టీఆర్ఎస్ పార్టీకి పీడ కలగానే చెప్పొచ్చు. ఇక త్వరలో జరగనున్న ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటు సిద్ధిపేట మున్సిపాలిటీ, ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ బైపోల్‌ ఆ పార్టీని కలవరపెడుతోంది. ఇప్పటికే ఊహించని ఓటములతో కాకమీదున్న గులాబీ టీం… ఈ ఎన్నికల్లో గెలిచితీరాలని పావులు కదుపుతోంది. ఈ మేరకు అంతర్గత నిర్ణయాలు వేగంగా, స్ట్రాంగ్‌గా ఉండనున్నట్టు సమాచారం.

ఇక ఇటీవలి ఓటములపై గుర్రుమీదున్న టీఆర్ఎస్ అధినేత… పార్టీ బలోపేతంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన గులాబీ బాస్… నిర్ణయాలు కూడా ఫైనల్‌ చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగా పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ అత్యంత కీలక మార్పులు-చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. మంత్రివర్గంలో మార్పులతో పాటు… పార్టీలోని కీలక పదవుల్లో కూడా మార్పులు ఉండబోతున్నాయని గులాబీ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్నట్టు… అతి త్వరలో మంత్రి కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పీఠం దక్కబోతుంది అనేది ఈ గుసగుసల సారాంశం. అయితే కేటీఆర్‌కు సీఎం పదవి దక్కితే పార్టీలో ఎలాంటి అసంతృప్తి తలెత్తకుండా… మంత్రులు హరీశ్‌, ఈటెలకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు పార్టీలో తెగ చెవులు కొరికేసుకుంటున్నారు. ఇక, గుసగుసల సంగతి ఎలా ఉన్నా… అవి ఎంతవరకు నిజమనేది తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *