అప్పటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..!

అగ్రరాజ్యాలతో పోటీపడుతూ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని భావిస్తున్న భారత్ తన లక్ష్యాన్ని మరో ఐదేళ్లలో చేరుకుంటుందని ఓ అధ్యయనం చెబుతోంది. 2025 నాటికి భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని బ్రిటన్ కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సీఈబీఆర్) తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది ఆరోస్థానానికి పరిమితమైన భారత్ మరికొన్నేళ్లలో బ్రిటన్ ను అధిగమించడం ఖాయమని సీఈబీఆర్ తెలిపింది. అంతేకాదు, 2030 నాటికి భారత్ 3వ స్థానానికి చేరుతుందని పేర్కొంది.

2019లో భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఈ క్రమంలో బ్రిటన్ ను వెనక్కి నెట్టింది. అయితే, కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచాయి. దాని ఫలితమే ఈ ఏడాది భారత్ ఆరో స్థానంలో నిలిచింది. 2024 వరకు బ్రిటన్ ఐదో స్థానానికి ఢోకా లేదని, ఆ తర్వాత భారత్ పుంజుకోవడం తథ్యమని సీఈబీఆర్ తన నివేదికలో అభిప్రాయపడింది.

భారత ఆర్థిక వ్యవస్థ 2021లో 9 శాతం విస్తరిస్తుందని, 2022లో 7 శాతం విస్తరిస్తుందని అంచనా వేసింది. 2023 నాటికి భారత్ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని, ఈ క్రమంలో 2025లో బ్రిటన్ ను, 2027లో జర్మనీని, 2030లో జపాన్ ను వెనక్కి నెడుతుందని నివేదికలో వెల్లడించారు. కాగా, 2028 నాటికి చైనా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి చేరుతుందని, అమెరికా రెండో స్థానానికి పడిపోతుందని సీఈబీఆర్ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *