దొంగలు కూడా చాలా అప్ డేట్ అయ్యారు. కొత్త కొత్త ట్రిక్స్ వాడుతూ.. దొంగతనాలకు పాల్సడుతున్నారు. జనాలు రోడ్డుపై నడవాలంటే కూడా బెంబేలెత్తిపోయేంత చురుగ్గా చోరీలకు పాల్పడుతున్నారు. ఇక విషయానికొస్తే.. మనం ఎక్కడికైనా వెళ్లినప్పుడో లేదా రోడ్డుపై నిలబడ్డప్పుడో ఎవరైనా వచ్చి మా వాళ్లకు ఫోన్ చేసుకోవాలని అడిగితే… ఏం చేస్తాం? వెంటనే నెంబర్ డయల్ చేసి ఇస్తాం… అలా కాదంటే ఫోన్ ఇచ్చి చేసుకోమని చెప్తాం. అచ్చం అలాగే చేశాడు హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన ఓ కుర్రాడు. అంతే ఇచ్చిన ఫోన్ తిరిగి రాలేదు. ఫోన్ తీసుకున్న వ్యక్తులు పారిపోయారు.
జీడిమెట్ల, షాపూర్‌నగర్ మస్తానా హోమ్స్‌లో నివాసముండే యూసఫ్ పాషా(16) శనివారం సుమారు 11.15 గంటలకు ఆటో కోసం షాపూర్‌నగర్ బస్టాప్‌లో ఎదురుచూస్తున్నాడు. అక్కడికి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అర్జెంట్‌గా కాల్ చేసుకోవాలని యూసఫ్పాషాను ఫోన్ అడిగారు. ఫోన్ ఇవ్వడమే ఆలస్యం.. తీసుకుని పారిపోయారు. దీంతో బాధితుడు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.