మ్యాట్రిమొనీలో యాంకర్ ఫోటో.. బురిడీ కొట్టించబోయి బుక్కయ్యింది..

మ్యాట్రిమొనీ సైట్‌లో నకిలీ వివరాలు పెట్టి మోసం చేసిన యువతిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలం, దిగమర్రు గ్రామానికి చెందిన బండి లావణ్య(25) భీమవరం పరిధిలోని ఉంటూ ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. అయితే.. ఎల్‌బీనగర్‌ చిత్రా లే అవుట్‌లో ఉండే గండి అంబరీష్‌ తన కుమారుడు ప్రవీణ్‌ కుమార్‌కు పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఆయన ఓ మ్యాట్రిమొనీ సైట్‌లో కుమారుడి వివరాలు పెట్టారు. కాగా… మ్యాట్రిమొనీ సైట్‌లో అంబరీష్‌ కుమారుడి వివరాలు చూసిన లావణ్య.. వెంటనే సైట్‌లో ఓ అందమైన టీవీ యాంకర్‌ ఫొటో తన ఫొటోగా పెట్టింది.

అంబరీష్‌కు ఫోన్‌చేసి తన పేరు శాన్విహృతిక అని పరిచయం చేసుకుంది. భీమవరంలో తమకు కాటన్‌మిల్స్‌ ఉన్నాయని, బాగా ధనవంతులమని నమ్మించింది. అనంతరం ఆమె తల్లిలా, తండ్రిలా, బంధువుల్లా మిమిక్రీ చేస్తూ అంబరీష్‌తో, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడింది. తర్వాత కొద్ది రోజులకు తనకు కరోనా సోకిందని, భీమవరం ఆస్పత్రిలో చేరానని, తన కజిన్‌ లావణ్య హైదరాబాద్‌కు వస్తోందని, ఆమెకు ఆశ్రయం ఇవ్వాలని కోరింది. తన కజిన్‌ లావణ్య అబ్బాయిని చూస్తే తాను చూసినట్లేనని, తామిద్దరూ ఒకటేనని.. చెప్పింది.

ఈ మేరకు కజిన్‌లాగా అంబరీష్‌ ఇంటికి వచ్చిన లావణ్య.. అందరినీ పరిచయం చేసుకుంది. శాన్వీకి ఇష్టమని చెప్పి అంబరీష్‌ కుమారుడితో కలిసి జర్కిన్‌, చీర, కాస్మోటిక్స్‌ కొనుగోలు చేసింది. అతడే అన్నింటికీ డబ్బు కూడా చెల్లించాడు. షాపింగ్‌ అనంతరం ఆమె తల్లితో మాట్లాడుదామని అంబరీష్‌ కుటుంబ సభ్యులు కాల్‌ చేయగా, లావణ్య దగ్గరున్న ఫోన్‌ రింగ్‌ కావడం గమనించారు. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితురాలిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *