మహిళల ఆర్థిక స్వావలంబనపై కరోనా దెబ్బ…

మహిళలు స్వతహాగా ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు పడుతున్న సమయంలో… కరోనా మహమ్మారి వారి ఆశలకు గండికొట్టింది. మహిళలు ఇప్పుడిప్పుడే ఇంటి నుంచి బటయకు వస్తూ.. ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా పయనిస్తుంటే కరోనా వారి లక్ష్యాలకు అడ్డుకట్ట వేసింది. కరోనా వ్యాప్తి, అనాలోచిత లాక్‌డౌన్‌ వల్ల గత 8 నెలల్లో దాదాపు 13 శాతం మంది మహిళలు తమ ఉపాధిని కొల్పోయారు. ఉన్న ఉద్యోగాలు పోయి, కొత్త ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కరోనా వల్ల మళ్లీ వంటింటికే పరిమితం అవుతున్నారు. స్త్రీ, పురుషుల మధ్య మళ్లీ ఆర్థిక అసమానాతలను కరోనా తీసుకువచ్చిందనే చెప్పొచ్చు. కరోనాతో సంవత్సర కాలంగా ఉద్యోగాలు లేక కుటుంబ భారం, పిల్లల పెంపకం వంటి అదనపు బాధ్యతలు మహిళలపై పడింది. ముఖ్యంగా మధ్య తరగతి మహిళలపై దీని ప్రభావం మరింత ఎక్కువ పడింది. పట్టణాలలో చిన్న చితకా పనులు చేసుకుంటూ కుటుంబ ఆర్థిక వ్యవహారాలలో ఇప్పుడిప్పుడే భాగాస్వామ్యం అవుతున్న వేళ కరోనా మరోసారి వారిని ఆర్థికంగా వెనక్కినెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల అభివృద్ది పేరుతో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినప్పటికి.. అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నాయి.

కరోనాతో పట్టణ ప్రాంతాలల్లో ఉపాధి కోల్పోయి గ్రామీణ ప్రాంతాలకు చేరి.. అక్కడ ఉపాధి అవకాశాలను వెతుక్కోవలసి వచ్చింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కొంత వరకు ఉపాధి కల్పించినప్పటికీ అది కేవలం 3 శాతం మాత్రమే. ఇప్పటికి కరోనా అన్ లాక్‌ తర్వాత మహిళలు వర్క్‌ఫోర్స్‌లోకి 3 నుంచి 4 శాతం మాత్రమే వచ్చారు. పురుషులతో పోల్చుకుంటే మహిళలు చాలా తక్కువ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. పురుషులు 13 శాతం ఉపాది పొందుతుంటే.. స్త్రీలు మాత్రం 3 శాతమే ఉపాధి పొందుతున్నారు. అంతే కాకుండా స్త్రీ-పురుషుల మధ్య వేతనంలో కూడా చాలా వ్యత్యాసం పెరిగింది.

ఉపాధి కొల్పవడం మూలంగా మహిళల్లో అనేక మానసిక, శారీరక సమస్యలు మొదలయ్యాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారిలో మానసిక సమస్యలు మరింత పెరిగాయి. ఆరోగ్య పరమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులు సాధారణ స్థితికి రావాలంటే ఎక్కువ సమయమే పడుతుందనేది ఒకెత్తు అయితే… ప్రభుత్వాలు కూడా మహిళా స్వావలంబన దిశగా గీతం కంటే రెట్టింపు చేయాలి అనేది ముఖ్యమైన సూచన‌.

– తోటకూర రమేష్, సీనియర్ జర్నలిస్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *