ఇక ఎమ్మారై, సీటీ స్కాన్‌ ఉచితం…

వైద్య రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. బస్తీ దవాఖానాలతో ప్రజలకు వైద్యాన్ని చేరువ చేయగా… ఎంతో ఖరీదైన ఎమ్మారై, సీటీ స్కాన్ పరీక్షలను ఉచితంగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో జాతీయ ఆరోగ్యమిషన్‌, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 16 రోగనిర్ధారణ కేంద్రాలను(మినీహబ్స్‌) ఏర్పాటు చేయనున్నారు. తొలి విడుతగా 8 మినీహబ్‌లను మూడురోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. బస్తీ దవాఖానలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో వైద్యం కోసం వెళ్తున్న వారికి ఆర్థికభారం నుంచి ఈ కేంద్రాలు ఉపశమనం కల్గించనున్నాయి.

ఇక.. నారాయణగూడలోని తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌తోపాటు ప్రభుత్వ దవాఖానల్లో రక్త, మూత్ర తదితర పరీక్షలను ఉచితంగానే చేస్తున్నప్పటికీ ఎక్స్‌రే, స్కానింగ్‌, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌, ఎమ్మారై, సీటీ స్కాన్‌ వంటి పరీక్షలు అందుబాటులో లేవు. ఇకపై వాటినీ చేస్తారు. వీటితోపాటు మినీ హబ్‌లుగా ఏర్పాటయ్యే డయాగ్నోస్టిక్‌ కేంద్రాల్లో ఈ పరీక్షలన్నీ ఉచితంగానే అందిచనున్నారు. ఆయా దవాఖానల్లోని వైద్యుల సిఫార్సుతో వెళ్లిన పేషెంట్లకు ఈ మినీ హబ్స్‌లో రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాలు ఆన్‌లైన్‌లో చూసుకునేలా సైతం ఏర్పాటుచేశారు.

గత నెల రోజులుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో నిర్వహించిన ట్రయల్‌ రన్‌ విజయవంతం కావటంతో మూడు రోజుల్లోగా వీటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లుచేశారు. మినీ హబ్స్‌ను అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో ఏర్పాటు చేశారు. తొలుత లాలాపేట్‌, శ్రీరాంనగర్‌, అంబర్‌పేట్‌, బార్కస్‌, జంగంపేట్‌, పురాణాపూల్‌, పానిపుర, సీతాఫల్‌మండీ యూపీహెచ్‌సీల్లో సేవలను ప్రారంభిస్తారు. ప్రతి కేంద్రంలో ల్యాబ్‌ మేనేజర్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్‌, రేడియోగ్రాఫర్‌తోపాటు ఎంపిక చేసిన రోజుల్లో రేడియాలజిస్ట్‌ అందుబాటులో ఉంటారు. వీటిని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *