ఘనంగా సీఎం కేసీఆర్ దత్త పుత్రిక వివాహం…

ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం.. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఘనంగా జరిగింది. సోమవారం ఉదయం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ లూర్థుమాత చర్చిలో నూతన దంపతులు ఒక్కటయ్యారు. ఈ వేడుకకు షాద్‌ నగర్ ఎమ్మెల్యే, అంజయ్య యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ గణేష్, మహిళా సంక్షేమశాఖ కమిషనర్ దివ్య దేవరాజుతో పాటు పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే.. ఆదివారం రోజు కేసీఆర్ సతీమణి శోభమ్మ ప్రత్యూషకు అరుదైన బహుమతి అందించారు. పట్టువస్త్రాలతో పాటు వజ్రాల నెక్లెస్‌ను బహూకరించి ఆశీర్వదించారు.

అయితే… హైదరాబాద్‌ నగరంలోని బండ్లగూడకు చెందిన ప్రత్యూష తల్లిదండ్రులు మనస్పర్దలతో విడిపోయారు. తల్లి 2003లో చనిపోయేముందు తన పేరుమీద ఉన్న ఆస్తిని కూతురు ప్రత్యూష పేరిట రాసింది. తండ్రి ఆమెను పట్టించుకోపోవటంతో బంధువులు సత్యసాయి ఆశ్రమంలో చేర్చించారు. 2013లో ప్రత్యూషకు మైనార్టీ తీరింది. ఆ తర్వాత తండ్రి ఇంటికి తీసుకెళ్లాడు. ప్రత్యూష పేరిట ఉన్న ఆస్తిని దక్కించుకునేందుకు సవతితల్లి పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. భౌతికదాడులకు సైతం పాల్పడింది. తండ్రి కూడా సవతి తల్లికే వత్తాసు పలికారు. ఈ విషయం అధికారులకు చేరడంతో.. మరణం అంచులకు చేరిన ప్రత్యూషను సవతితల్లి, తండ్రి చెరనుంచి విముక్తి కల్పించారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ ప్రత్యూషను దత్తత తీసుకుని… ఆమె కోరిక మేరకు నర్సింగ్‌కోర్సును పూర్తి చేయించారు. ప్రత్యూష ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో పనిచేస్తూ సొంతకాళ్లపై నిలబడింది. ఆమె కోరిక మేరకు రాంనగర్‌కు చెందిన మమత, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డితో సోమవారం వివాహం జ‌రిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *