ఆడవాళ్లు రాత్రిపూట స్వేచ్ఛగా తిరిగిన రోజే భారత్‌కు అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్టని మహాత్ముడు అన్నాడు. కానీ, నేడు మహిళలు పగలు కూడా రోడ్లపై తిరిగే స్వేచ్ఛలేదు. మహిళలే కాదు… అభం శుభం తెలియని చిన్నారులు మొదలు పండు వృద్ధుల వరకు రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మానవ మృగాల్లో మార్పులు మచ్చుకైనా కనిపించడం లేదు. యూపీలో ఓ ప్రభుత్వ ఉద్యోగి రాక్షసుడిలా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని 50 మంది చిన్నారులపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పదేళ్ల కాలంలో 50 మంది చిన్నారులను అత్యాచారం చేసి పైశాచిక ఆనందం పొందాడు. ఇందుకు అతని భార్య కూడా సహకరించింది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి రాంభవన్… ఐదు నుంచి 16 సంవత్సరాల వయసున్న అమ్మాయిలపై కన్నేశాడు. దీంతో వారికి మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకొచ్చేవాడు. అలా పదేళ్ల కాలంలో 50 మంది అమ్మాయిలపై అత్యాచారం చేశాడు. ఈ దారుణంలో భర్తకు భార్య కూడా సహకరించినట్టు తెలుస్తోంది. బాధిత అమ్మాయిలంతా… బందా, చిత్రకూట్, హమీర్పూర్ జిల్లాలకు చెందిన వారు. ఈ విషయం గత నెలలో వెలుగులోకి వచ్చింది. దీంతో రాంభవన్తో పాటు ఆయన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 4వ తేదీ వరకు ఆమెకు జ్యుడిషీయల్ కస్టడీ విధించగా, భర్త సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే, అమ్మాయిలపై అత్యాచారం చేసిన అనంతరం వారు ఆ విషయాన్ని మరిచిపోయేందుకు వారికి విలువైన స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ర్టానిక్ గ్యాడ్జెట్స్‌ను ఉచితంగా ఇచ్చేవాడు.
ఇక.. నిందితుడు రాంభవన్ ఇంట్లో తనిఖీలు చేయగా 8 మొబైల్ ఫోన్లు, రూ. 8 లక్షల నగదు, సెక్స్ టాయ్స్, ల్యాప్‌టాప్‌తో పాటు ఇతర డిజిటల్ పరికరాలు లభ్యమయ్యాయి. ఇక ఈ అమ్మాయిలకు సంబంధించిన ఫోటోలను వీడియోలను దేశస్తులతో పాటు విదేశీయులకు అమ్ముకున్నట్లు విచారణలో తేలింది. అటు.. నేషనల్ క్రైమ్ బ్యూరో నివేదిక ప్రకారం… ప్రతి రోజు 100 మంది చిన్నారులు అత్యాచారానికి గురవుతున్నారు. గతేడాది కంటే ఇలాంటి కేసులు 22 శాతం పెరిగాయి. 2008 నుంచి 2018 వరకు చిన్నారులపై లైంగికదాడులు ఆరు రెట్లు పెరిగినట్లు నివేదికలో వెల్లడైంది. అత్యధికంగా యూపీలోనే అత్యాచార కేసులు నమోదు అయ్యాయి.