టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

2020 ఎందరో సినిమా నటులను పొట్టనబెట్టుకుంది. గొప్పగొప్ప ప్రముఖులను చిత్రపరిశ్రమకు దూరం చేసి… విషాదాన్ని మిగిల్చింది. 2020 చివరి రోజు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి విషాదంతోనే వీడ్కోలు చెప్పింది.

ఇవాళ (2020 చివరి రోజు) ప్రముఖ సినీనటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. అనారోగ్యంతో నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన… కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. మెజారిటీ సినిమాల్లో విలన్ పాత్రలో నటించిన నర్సింగ్ యాదవ్… పలు కామెడీ సినిమాల్లోనూ విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.

ర‌జ‌నీకాంత్ న‌టించిన బాషాలోనూ మంచి పాత్ర చేశారు. విజ‌య‌నిర్మ‌ల ద‌ర్శక‌త్వం వ‌హించిన హేమాహేమీలుతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు నర్సింగ్ యాదవ్. క్ష‌ణ‌క్ష‌ణం, గాయం, ముఠామేస్త్రీ, మాస్‌, శంక‌ర్ దాదా ఎంబీబీయ‌స్‌, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్ల‌జ‌మీందార్‌, సుడిగాడు, కిక్‌ త‌దిత‌ర చిత్రాల్లో ఆయ‌న చేసిన కేర‌క్ట‌ర్ల‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీనెంబ‌ర్ 150లోనూ న‌టించారు. గ‌త కొంత‌కాలంగా నర్సింగ్ యాదవ్‌కు డయాలసిస్ జ‌రుగుతోంది.

1963 మే 15న హైద‌రాబాద్‌లో జన్మించిన ఆయ‌న‌కు భార్య చిత్ర‌, కొడుకు రిత్విక్ యాద‌వ్‌ ఉన్నారు. ఈయన మరణంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. నర్సింగ్ యాదవ్‌ మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *