వరంగల్ జిల్లాకు మరో టెక్స్‌టైల్ పార్కు :మంత్రి కేటీఆర్

వరంగల్‌ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. వరంగల్‌ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తి మేరకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు స్థానిక నేతన్నలకు మరింత ప్రయోజనం కలిగేలా మినీ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. చేనేత, జౌళి శాఖపై ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్… ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అటు… కొడకండ్లలో నైపుణ్యం కలిగిన వేలాదిమంది నేతన్నలు తమ పని కొనసాగిస్తున్నారని, చాలామందికి సరైన ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక టెక్స్‌టైల్‌ రంగానికి ఇస్తున్న మద్దతుతో వలస వెళ్లిన అనేకమంది రాష్ట్రానికి తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. నేతన్నల కోసం చేపట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని కేటీఆర్‌ చెప్పారు.

రాష్ట్రంలోని పవర్‌ లూమ్‌ కార్మికులను ఆదుకునేందుకు ఏటా ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న బతుకమ్మ చీరల తయారీ కార్యక్రమాన్ని ఈసారి కూడా కొనసాగిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కరోనా సంక్షోభ కాలంలోనూ నేతన్నలకు పెద్దఎత్తున ప్రయోజనం కలిగిందన్నారు. కాంట్రిబ్యూషన్‌ మినహాయింపు ద్వారా 25,000 మంది నేతన్నల కుటుంబాలకు రూ.95 కోట్ల మేర లబ్ధి చేకూరిందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని తిరిగి కొనసాగించాలని నేతన్నల నుంచి వస్తున్న విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి… త్వరలోనే ప్రారంభమయ్యేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్‌లో చేనేత, జౌళి రంగాలకు కేటాయించాల్సిన అంశాలకు సంబంధించి పూర్తి కసరత్తు చేసి నివేదిక రూపొందించాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *