తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ఈ నెల 7న ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమెతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు కేబినెట్ మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, అధికారులు పాల్గొంటారు. ఈ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు రాజ్‌భవన్‌లో కొనసాగుతున్నాయి.
కాగా,. 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించిన జస్టిస్ హిమా కోహ్లీ… అక్కడే సెయింట్ థామస్ స్కూల్ నుంచి పాఠశాల విద్యాభ్యాసం, సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి హిస్టరీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అనంతరం హిస్టరీలో పీజీ, ఎల్ఎల్బీ పూర్తిచేసి 1984లో ఢిల్లీ యూనివర్సిటీ లా-సెంటర్లో ఫ్యాకల్టీగా చేరారు. 2006లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియామకమై 2007, ఆగస్టు 29న శాశ్వత జడ్జిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత వివిధ కమిటీలకు చైర్‌పర్సన్‌గా పనిచేసి, ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.