రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్ నడుస్తోంది :సీఎం జగన్
ప్రభుత్వ పథకాలపై ప్రజల దృష్టిని మళ్ళించేందుకు కుట్రలు జరగుతున్నాయని ఏపీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్ చేస్తున్న వారిపై కూడా దృష్టి సారించాలని పోలీసులకు సూచించారు. చిత్తూరులో పోలీస్ డ్యూటీ మీట్‌ను సీఎం క్యాంపుకార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన జగన్… రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ కుట్రలపై మండిపడ్డారు. ‘‘కొంతమందికి దేవుడు అంటే భయంలేదు, భక్తి లేదు. దేవుడిపై రాజకీయం చేస్తున్నారు. దేవుడి విగ్రహాలతో చెలగాటమాడుతున్నారు. విగ్రహాలు ధ్వంసం చేసి పచ్చ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. వీళ్లు అసలు మనుషులేనా.. కులాలు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇలాంటి కేసులను విచారించే పరిస్థితిలోకి మనం వచ్చాం. దేవుడి విగ్రహాలను పగులగొడితే ఎవరికి లాభం? ఆలయాల్లో అరాచకం చేస్తే ఎవరికి లాభం? ప్రజల విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు, విష ప్రచారం చేస్తే ఎవరికి లాభం? ఎవరిని టార్గెట్ చేసి ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారు?’’ అంటూ ప్రతిపక్షాల తీరును సీఎం జగన్ ఎండగట్టారు. ఇలాంటి వాటిని ప్రజలు నిశితంగా గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనల్లో వేగంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. నిందితులు ఎంతటివారైన వివరాలు బయటపెట్టాలని ఆదేశించారు.