దక్షిణ భారతదేశంలో పాగా వేయాలనే సంకల్పంతో బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్తోంది. తెలంగాణలో ఇప్పటికే దుబ్బక ఉపఎన్నిక సహా జీహెచ్ఎంసీలో విజయంతో కమలం టీమ్ జోష్ పెరిగింది. అదే స్పీడ్‌తో బీజేపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ… కారుకు ప్రత్యామ్నాయం కమలమే అని నిరూపించుకునేందుకు పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి రావడమే ఎజెండాగా కాషాయదళం పావులు కదుపుతోంది.
ఇక.. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసి రోజులు గడుస్తున్నా… తమను కార్పొరేటర్లుగా గుర్తించడం లేదని… ఈ మేరకు వెంటనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలిచినప్పటికీ తమ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులూ చేయలేకపోతున్నామని మండిపడ్డారు. పాత కొర్పొరేటర్లే ఇప్పటికీ ఆధిపత్యం చలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు ఎన్నుకున్న తమకు ఏ మాత్రం విలువ లేకుండా ఉందని కార్పొరేటర్లు వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్పొరేటర్లు ప్రగతి భవన్‌ను ముట్టడించిన సందర్భంగా అక్కడ పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.