అక్రమ అరెస్టులు ఆపకపోతే రాష్ట్రం తగలబడిపోతుంది :విష్ణువర్థన్ రెడ్డి

అక్రమ అరెస్టులు ఆపకపోతే రాష్ట్రం తగలబడిపోతుంది :విష్ణువర్థన్ రెడ్డి

వైసీపీ ప్రభుత్వం అవినీతి కూపంలో కూరుకు పోయిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ అరెస్టులను ఆపకపోతే రాష్ట్రం తగలబడిపోతుందని హెచ్చరించారు. ఇంటి స్థలాల సేకరణలో జరిగిన అవినీతిని నిరూపించేందుకు ముందుకొస్తే… వైసీపీ నేతలు పారిపోయారని చురకలంటించారు. ఇక.. ఇంటి స్థలాల సేకరణలో భారీ అవినీతి జరిగిందని నిరూపిస్తానని సవాల్ విసిరిన విష్ణువర్థన్ రెడ్డి మంగళవారం రోజు శ్రీకాళహస్తీకి వచ్చారు. ఈ సందర్భంగా విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ… తన సవాల్ స్వీకరించేందుకు అధికార వైసీపీ నేతలు ఎవరూ ముందుకు రాలేదని ఆరోపించారు.

అటు… రామతీర్థంలో ఆందోళన చేస్తున్న నేతలను పరామర్శించడానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెళితే ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం చూస్తే… సీఎంగా ఉన్న జగన్‌ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారా? అనే సందేహం కలుగుతుందన్నారు. తక్షణమే సోము వీర్రాజును విడుదల చేయకపోయినా… అక్రమ అరెస్టులు ఆపకపోయినా… రాష్ట్రం తగలబడిపోతుందని తీవ్ర హెచ్చరికలు చేశారు. దీనికి సీఎం జగన్‌ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని విమర్శించారు. వారికి వైసీపీ కార్యాలయం జీతం ఇస్తుందా.. ప్రభుత్వం ఇస్తుందా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మానవ హక్కులకు తీవ్రస్థాయిలో భంగం కలుగుతుందని… దీనిపై మానవ హక్కుల సంఘంతో పాటు కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

ఇంటి స్థలాలకు సంబంధించి అతి తక్కువ ధర కలిగిన భూములను అధిక రేట్లకు కొనుగోలు చేశారని దీంతో మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. ఈ అవినీతిని సాక్ష్యాలతో సహా నిరూపించడానికి సిద్ధమైతే వైసీపీ నాయకులు పారిపోయారని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు భూసేకరణలో 9వేల కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసినట్లు చెబుతున్నారని… అందులో అధిక ధరలతో కోట్ల రూపాయల ప్రజాధనం అవినీతి బాటపట్టిందన్నారు. ఈ అవినీతిని నిరూపించడానికి తాము ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధమేనని… నీతి, నిజాయితీ గురించి మాట్లాడే ముఖ్యమంత్రి, వైసీపీ నాయకులు తమ సవాల్‌ను స్వీకరించడానికి ముందుకు రావాలని విష్ణువర్ధన్ రెడ్డి మరోసారి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *