సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన లోక్‌సభ స్పీకర్ కుమార్తె…
యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్‌కు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి ఎంపికయ్యారు. యూపీఎస్సీ తాజాగా విడుదల చేసిన రిజర్వ్ లిస్ట్ 89 మంది అభ్యర్థుల్లో అంజలి ఒకరు. రామ్జాస్ కాలేజీ నుండి ఆమె పొలిటికల్ సైన్స్(ఆనర్స్)ను పూర్తిచేసింది. 2019లో తన మొట్టమొదటి ప్రయత్నంలోనే ఆమె సివిల్స్‌కు ఎంపికైంది.
దీనిపై అంజలి స్పందిస్తూ.. సివిల్స్‌కు ఎంపికవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సివిల్ సర్వీసెస్‌లో చేరాలనేది తన కల అన్నారు. దేశ ప్రజల పట్ల తన తండ్రి నిబద్ధతను ఎప్పుడూ చూస్తున్నందున సమాజం కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో సివిల్ సర్వీసుల్లో చేరాలనుకున్నట్లు చెప్పారు. సివిల్స్ సాధించేందుకు చార్డర్డ్ అకౌంటెంట్ అయిన తన సోదరి ఆకాంక్ష ఎంతగానో సహకరించినట్లు తెలిపారు. ఈ విజయం తన అక్కకే అంకితమన్నారు.
2019 సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలను 2020 ఆగస్టు 4న ప్రకటించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్తో పాటు గ్రూప్-ఏ, గ్రూప్-బి వంటి కేంద్ర సర్వీసుల నియామకం కోసం మొత్తం 927 పోస్టులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించింది. మెరిట్ క్రమంలో తొలుత 829 మంది అభ్యర్థుల ఎంపికను ప్రకటించింది. రిజర్వ్ జాబితా నుండి వివిధ సివిల్ సర్వీసుల కోసం అంజలితో సహా 89 మంది అభ్యర్థులను తాజాగా ప్రకటించింది.