ప్రభుత్వానికి టాలీవుడ్‌ నిర్మాతల మండలి లేఖ..

ప్రభుత్వానికి టాలీవుడ్‌ నిర్మాతల మండలి లేఖ..

100 శాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతించాలని వినతి

ఇప్పటికే 100 శాతం సీటింగ్‌కు తమిళనాడు ప్రభుత్వం అనుమతి

కరోనా మహమ్మారి ధాటికి కుదేలైన రంగాల్లో సినిమా రంగం కూడా ఒకటి. దాదాపు 10 నెలలుగా మూతపడిన సినిమా థియేటర్లు.. ఈ మధ్యనే ఓపెన్ అయ్యాయి. అయితే… 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే ప్రభుత్వం సినిమా థియేటర్లకు అనుమతి ఇచ్చింది. కానీ.. 50 శాతం సీటింగ్‌ వల్ల చాలా నష్టపోతున్నామని.. తమను ఆదుకోవాలని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల ముఖ్యమంత్రులకు లేఖ రాసింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న 50 శాతం సీటింగ్ నిబంధన కారణంగా థియేటర్ల ఆదాయం కంటే ఖర్చులు పెరిగిపోతున్నాయని, అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ, సగం ప్రేక్షకులతో సినిమా ప్రదర్శనలు నిర్వహించడం ఆర్థికంగా భారంగా మారుతోందని వివరించింది. ఖర్చులు కూడా రావడంలేదు సరికదా, థియేటర్ల యాజమాన్యాలు నష్టాల పాలయ్యే పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. దయచేసి 50 శాతం సీటింగ్ నుంచి 100 శాతం సీటింగ్ తో అన్ని మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా ప్రదర్శనలు నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ నిర్ణయం వల్ల థియేటర్లు, మల్టీప్లెక్సుల యాజమాన్యాలు కోలుకుంటాయని, థియేటర్లు, మల్టీప్లెక్సుల నిర్వహణకు తగిన ఆదాయం పొందుతాయని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తన లేఖలో వివరించింది.

కాగా… సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో 100 శాతం సీటింగ్ నింపుకోవడానికి అనుమతినిస్తూ ఇటీవలే తమిళనాడు సర్కారు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదవుతున్న నేపథ్యంలో తమిళనాడు సర్కారు అన్ని నిబంధనలు పాటిస్తూ 100 శాతం సీటింగ్ తో సినిమా ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చని ఇటీవలే అనుమతి నిచ్చిందని నిర్మాతల మండలి తన లేఖలో ప్రస్తావించింది. తమిళనాడు తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ 100 శాతం సీటింగ్ కెపాసిటీతో చిత్ర ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, మంత్రులు ఈ అంశంపై పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *