మంత్రి కేటీఆర్‌కు `వరల్డ్ ఎకనామిక్ ఫోరం` ఆహ్వానం…

మంత్రి కేటీఆర్‌కు `వరల్డ్ ఎకనామిక్ ఫోరం` ఆహ్వానం…

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) నిర్వహించనున్న ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్ సదస్సు-2021లో పాల్గొనాలని ఆహ్వానం అందింది. జపా‌న్‌ రాజధాని టోక్యో నగరంలో 2021 ఏప్రిల్‌ 5-7 తేదీలో ఈ సదస్సు జరుగనుంది. ఈ సదస్సులో వివిధ దేశాల ప్రభుత్వాధినేతలతో పాటు మంత్రులు, వ్యాపార, వాణిజ్య రంగాల ప్రముఖులు భాగస్వాములు కానున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కోవిడ్-19 సంక్షోభం అనంతరం తిరిగి దేశాలు వృద్ధి బాట పట్టేందుకు ఎమర్జింగ్ టెక్నాలజీల వినియోగం అనే ప్రధాన అంశంపై ఈ సదస్సు జరగనుంది.

నాలుగవ పారిశ్రామిక విప్లవంలో ఈ నూతన టెక్నాలజీల వినియోగం ద్వారా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాలను మరింతగా ముందుకు తీసుకెళ్లే అంశంతో పాటు ఆయా టెక్నాలజీల పరిమితులను అధిగమిస్తూ వృద్ధిని వేగవంతం చేయడం… ఈ రంగాల్లో ఏ విధంగా ఇన్నోవేషన్‌ను ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయంపై ఈ సదస్సులో చర్చించనున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాజిక లబ్ధికోసం ఏవిధంగా ఉపయోగించాలనే విషయంలో కేటీఆర్ నాయకత్వంలో వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నారని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆయనకు పంపిన లేఖలో ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు ఆ ప్రత్యేక లేఖలో కేటీఆర్‌ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు బోర్గ్ బ్రండే ప్రశంసించారు. ఎఐ4ఏఐ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్, జీ-20 స్మార్ట్ సిటీస్ అలయన్స్ వంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేపట్టిన కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇచ్చినందుకు డబ్ల్యూఈఎఫ్‌ ధన్యవాదాలు తెలిపింది.

భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపింది. జపా‌న్‌లోని టోక్యోలో నిర్వహించనున్న గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ సదస్సుకు మంత్రి కేటీఆర్ రావడం ద్వారా తెలంగాణకు ప్రపంచ వేదికపై ఎమర్జింగ్ టెక్నాలజీస్ రంగంలో మరిన్ని అవకాశాలను కల్పిస్తుందని ఫోరం మంత్రికి పంపిన లేఖలో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *