తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తీన్మార్ మల్లన్న.. అలియాస్ చింతపండు నవీన్‌కు ప్రజాధారణ పెరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఫలితాల్లో ఆయనకున్న ఫాలోయింగ్ అర్థమైంది. జాతీయ పార్టీలను సైతం పక్కనబెట్టిన అధికార టీఆర్ఎస్ పార్టీకి చివరి వరకు ముచ్చెమటలు పట్టించారు. తాజాగా తమ సమస్యలను వివరించేందుకు మల్లన్న దగ్గరకు క్యూ కడుతున్నారు పలువురు బాధితులు. తమ సమస్యలు పరిష్కరించేందుకు అండగా ఉండాలని కోరుతున్నారు.
ఇందులో భాగంగానే హైదరాబాద్.. ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని పర్వతాపూర్ గ్రామ మైనార్టీ క్రిస్టియన్ నాయకులు మల్లన్నను కలిశారు. గ్రామం చివరలో గల స్మశాన వాటిక విషయంలో న్యాయం చేయాలని కోరగా.. మల్లన్న సానుకూలంగా స్పందించారు. వెంటనే మేయర్ జక్కా వెంకట్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి.. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ… సమస్య పరిష్కరించని పక్షంలో తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.